రాష్ట్రంలో సుమారు 80 లక్షల మందికి తొలివిడతలో కొవిడ్ టీకాలను ఉచితంగా అందజేయనుండగా... వారిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బంది సుమారు 4 లక్షలమంది ఉంటారని అంచనా. ఇప్పటికే మూడున్నర లక్షలమంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బంది మరో 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తోంది.
వారి పేర్లను కొవిన్ యాప్‌లో పొందుపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. వీరందరికీ పూర్తికావడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయం పట్టవచ్చని అంచనా. ఆ తర్వాత మార్చిలో 50 ఏళ్లు దాటిన, ఆ లోపు వయసులో దీర్ఘకాలిక సమస్యలున్నవారికి టీకాలను ఇవ్వనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. అత్యధిక సంఖ్యలో కొవిడ్ టీకా పొందేవారు 50 ఏళ్లు పైబడినవారే.
రెండు కేటగిరీల్లో 91 శాతం మంది...
ఈ కేటగిరీలో సుమారు 66 లక్షల మంది ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరితోపాటు 18 నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక రోగులు సుమారు 7 లక్షలమంది ఉంటారని భావిస్తోంది. ఈ రెండు కేటగిరీల లబ్ధిదారులు కచ్చితంగా ఎందరు ఉంటారనే విషయంలో స్పష్టత లేదు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో తొలివిడతలో ఉచితంగా టీకాలు పొందనున్నవారిలో 91 శాతం మంది ఈ రెండు కేటగిరీల్లోనే ఉన్నారు.