హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగగా... రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, కాలనీలు, బస్తీలు... వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లగా... ద్విచక్రవాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.
ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని బస్తీల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరగా స్థానికులు బయటకు తోడిపోశారు. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు చేరి అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. మేడిపల్లి వద్ద గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా.... ఆసిఫ్‌నగర్‌లో గోడ కూలడం వల్ల రెండు ద్వచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఏఎస్ రావునగర్‌లో ప్రధాన రహదారి కుంగిపోయింది.
వర్షానికి అతలాకుతలం..
భారీ వర్షాలకు నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఆమీర్‌పేట, బోరబండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సికింద్రాబాద్.. తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. పలు చోట్ల రోడ్లపై వరదనీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.