తెలంగాణ

telangana

ETV Bharat / state

Budget for Telangana Railways : పెండింగ్‌ ప్రాజెక్టులకు పచ్చజెండా - తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

Budget for Telangana Railways : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రైల్వే పరంగా భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాలేదు. కానీ ఇప్పటికే మంజూరై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం నిధులను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చిక్కుముడి కారణంగా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో కొన్నిటికి మోక్షం కలిగించింది.

Telangana Railways
Telangana Railways

By

Published : Feb 4, 2023, 7:07 AM IST

Budget for Telangana Railways : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేపరంగా రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాలేదు. అయితే ఇప్పటికే మంజూరై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది. గతేడాది రూ.3,045 కోట్లతో పోలిస్తే ఈసారి 45% పెంచి రూ.4,418 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చిక్కుముడి కారణంగా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో కొన్నిటికి మోక్షం కలిగించింది.ఇందులో హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశ, రామగుండం-మణుగూరు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

Union Budget for Telangana Railways : భద్రాచలం-కొవ్వూరు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీ కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఈసారి కూడా సాకారంకాలేదు. సర్వే పూర్తయిన రైల్వే లైన్ల మంజూరును పట్టించుకోలేదు. కొత్త సర్వేల జోలికి వెళ్లలేదు. రైల్వేశాఖ జోన్ల వారీగా పింక్‌ బుక్‌ కేటాయింపులను పరిశీలిస్తే- నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు ముఖ్యంగా రద్దీ మార్గాల్లో మూడో లైను పనులకే కొంత ప్రాధాన్యం లభించింది.చర్లపల్లి టెర్మినల్‌కు, కాజీపేటలో వ్యాగన్‌ వర్క్‌షాప్‌నకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు లభించాయి.

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశకు రెండేళ్లుగా రూ.పదేసి లక్షలే కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ ఇస్తేనే నిర్మాణపనులు పూర్తవుతాయని చెబుతూ వచ్చింది. ఈసారి వైఖరి మార్చుకుని బడ్జెట్‌లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించింది. దీంతో హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నగర ప్రయాణికులకు చౌక ప్రయాణం అందుబాటులోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. రామగుండం-మణుగూరు ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రైల్వేశాఖ భరించే అవకాశాలున్నాయి.

కొత్త రైల్వే లైన్లు

మనోహరాబాద్‌-కొత్తపల్లి: రూ.185 కోట్ల నిధులు కేటాయించారు. 2006-07లో మంజూరైన 151 కిమీల ఈ మార్గం అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి మూడో వంతు ఖర్చు భరిస్తోంది. ప్రస్తుతం మనోహరాబాద్‌-కొడకండ్ల 44 కిమీ దూరం పూర్తయ్యింది. భూసేకరణ త్వరితగతిన జరగాలని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌:రూ.345 కోట్లు కేటాయించారు. 1997-98లో మంజూరైన ఈ మార్గం పొడవు 244 కిమీ.లు. 68 కిమీ తెలంగాణలో, 178 కిమీ మహారాష్ట్రలో ఉంది. అంచనా వ్యయం రూ.1,723 కోట్లు. ప్రస్తుతం దేవరకద్ర-మాగనూరు 54 కిమీ మార్గం పూర్తయ్యింది. మాగనూరు-కృష్ణా స్టేషన్ల మధ్య పనులు తాజాగా పూర్తయ్యాయి. కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్‌ ఒకట్రెండు రోజుల్లో రానుంది. దీంతో మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటక సరిహద్దు కృష్ణా వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడపడానికి అవకాశం ఏర్పడింది.

భద్రాచలం రోడ్‌-కొవ్వూరు:రూ.20 కోట్లు కేటాయించారు. 151 కిమీ.ల ఈ మార్గం 2012-13లో మంజూరైంది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.2,154.83 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో వాటా విషయంలో చిక్కుముడి ఏర్పడింది. దీంతో ఏటా రూ.లక్ష నిధులే కేంద్రం మంజూరు చేస్తోంది. మరోవైపు సింగరేణి భాగస్వామ్యంతో భద్రాచలంరోడ్‌-సత్తుపల్లి వరకు రైల్వేశాఖ రైలు మార్గం నిర్మించింది. తెలంగాణలోని సరిహద్దు సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు రైలే మార్గం నిర్మిస్తే సికింద్రాబాద్‌-విశాఖపట్నం వైపు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల ప్రాంతాల నుంచి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం నౌకాశ్రయాలను ఈ మార్గం అనుసంధానం చేస్తుంది.

మణుగూరు-రామగుండం: ఈ బడ్జెట్‌లో కేటాయించింది రూ.10 కోట్లు. 200 కిమీ.ల ఈ మార్గాన్ని 2013-14లో మంజూరు చేశారు. తొమ్మిదేళ్లుగా ముందడుగు పడకపోవడంతో అంచనా వ్యయం రూ.1,112 కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది.

సర్వే పూర్తయిన కాజీపేట-హుజూరాబాద్‌-కరీంనగర్‌ ప్రతిపాదిత రైల్వే లైన్‌ని మంజూరుచేస్తారని భావించగా రైల్వేశాఖ నిరాశపరిచింది. లింగంపల్లి-వికారాబాద్‌ రెండోలైను మంజూరు కాలేదు. యాదాద్రి ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ గురించి పట్టించుకోలేదు.

ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు మూడో లైను నిర్మిస్తే దిల్లీ, విజయవాడ వైపు రాకపోకలు సులభం అవుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ ప్రాధాన్యం ఇవ్వలేదు. వందేభారత్‌ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్‌, కాచిగూడతో పాటు ఏపీలోని తిరుపతి స్టేషన్లలో పిట్‌ లైన్లను ద.మ.రైల్వే అభివృద్ధి చేసింది.

డబ్లింగ్‌/థర్డ్‌ లైన్లు

220 కిమీ.ల కాజీపేట-విజయవాడ మూడో లైను అంచనా వ్యయం రూ.1,953 కోట్లు కాగా ఈ ఏడాది రూ.337.52 కోట్లు కేటాయించారు.

201 కిమీ. పొడవైన కాజీపేట-బల్లార్ష మూడో లైను పనులకు రూ.450.86 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.2,063 కోట్లు.

248 కిమీల బీబీనగర్‌-గుంటూరు డబ్లింగ్‌ పనుల అంచనా వ్యయం రూ.2,480 కోట్లకుగాను ఈ బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించారు.

కాజీపేట 10.65 కి.మీ.ల బైపాస్‌ లైనుకి నిధులిచ్చారు. పగిడిపల్లి-నల్లపాడు విద్యుద్దీకరణ పనులకు రూ.32.8 కోట్లు... జోన్‌ పరిధిలో స్టేషన్ల అభివృద్ధికి రూ.215 కోట్లు ఇచ్చారు.

కాజీపేట వర్క్‌షాప్‌నకు రూ.160 కోట్లు, చర్లపల్లి టెర్మినల్‌కు రూ.82 కోట్లు కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details