తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు.. తెరాస  కసరత్తులు!

శాసనమండలి ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రణాళికబద్ధంగా కసరత్తు చేస్తోంది. ఓ వైపు పట్టభద్రుల స్థానాలు రెండింటిని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తూనే.. మరోవైపు గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి.. వ్యవహరిస్తోంది. రానున్న కార్పొరేషన్ల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని పలు సమీకరణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల స్థానాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, నామినేటెడ్ స్థానాలకు కర్నె ప్రభాకర్, గోరటి వెంకన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Trs planning for Two Mlc won
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు.. తెరాస  కసరత్తులు!

By

Published : Sep 24, 2020, 2:41 PM IST

Updated : Sep 24, 2020, 4:18 PM IST

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు.. తెరాస వ్యూహాలకు పదును పెడుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాన్ని నిలబెట్టుకోవడమే గాక.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు స్థానాల్లో తెరాస బలపరిచిన అభ్యర్థి గెలిచేలా ఇప్పటి నుంచే పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెరాస నాయకత్వం రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి తెరాస బలపరిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో దేవీప్రసాద్ ఓటమి పాలయ్యారు.

జిల్లా నేతలకు దిశానిర్దేశం..

వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మళ్లీ పోటీలో నిలపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్​ను బరిలోకి దించాలని తెరాస పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోస్థానం కోసం న్యాయవాదులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మ, వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలకు తెరాస నాయకత్వం ఇప్పటికే దిశా నిర్దేశం చేసింది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశాలు నిర్వహించి.. వ్యూహాలపై చర్చించారు. ముందుగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించారు. మంత్రులు, ముఖ్య నేతలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జాబితాలో గోరేటి వెంకన్న పేరు!

గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి కసరత్తు చేస్తోంది. నాయని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ పదవీ కాలం ముగిసింది. రాములు నాయక్ సస్పెన్షన్ అయినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. కర్నె ప్రభాకర్​కు మరోసారి అవకాశం ఇచ్చేందుకు తెరాస నాయకత్వం హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరో స్థానానికి ప్రముఖ కవి గోరటి వెంకన్న పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాయని నర్సింహారెడ్డి, సీతారాం నాయక్ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ సామాజిక సమీకరణలతో తెరాస కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి: మూడో రోజు విచారణ.. నగేశ్​ బ్యాంకు లాకర్​ తెరిచే అవకాశం

Last Updated : Sep 24, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details