TRS MPs on Modi: పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై చర్చించాలని కోరితే సమయం ఇవ్వడంలేదని తెరాస ఎంపీలు ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల విలువ, గౌరవంలేదని ఎంపీ వెంకటేశ్ నేతకాని విమర్శించారు. మోదీ నియంత పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఎదిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల సమస్యలు విని పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ చెల్లించింది రూ.3,65,797 కోట్లు అని లెక్క చెప్పారు. తెలంగాణకు కేంద్రం చెల్లించింది రూ.1,96,448 కోట్లు మాత్రమే అని వివరించారు. తెలంగాణ రైతులను పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం ఇచ్చేది.. తెలంగాణ చెల్లించేది.. లెక్క తేల్చేసిన ఎంపీలు
TRS MPs on Modi: మోదీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాల గొంతు నొక్కుతోందన్న తెరాస ఎంపీలో దిల్లీలో ఆరోపించారు. ప్రతిపక్షాలకు చర్చించే అవకాశమివ్వడం లేదని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఈ సమావేశాల్లోనైనా.. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను చర్చిస్తారని బలంగా నమ్మినాము. కానీ ఈ మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గొంతును నొక్కుతోంది. గబ్బర్ సింగ్ ట్యాక్స్‌లపై మోదీ సమాధానం చెప్పాలి. నిజంగా ఈ మోదీ ప్రభుత్వం తప్పు చేయకపోతే... ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు చర్చించే అవకాశం ఇవ్వడం కనీసం బాధ్యత. ఇలాంటి నియంతృత్వ ధోరణిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. - ఎంపీ వెంకటేశ్ నేతకాని
ఆదర్శగ్రామాల పంచాయతీల్లో 21లో 19 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎంతగా అభివృద్ధి అయిందో ఇదే నిదర్శనమని చెప్పారు. కయ్యానికి పోకుండా.. తెలంగాణకు సాయం చేయండని పేర్కొన్నారు. ఏ విధంగానైనా తెలంగాణ ప్రభుత్వం వెనకంజలో ఉందా... అని ప్రశ్నించారు.