Traffic Police Summer Problems In Telangana : భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెగలు కక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటే హడలిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో వెళ్లాల్సి వస్తే.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. వివిధ దారులు వెతుక్కుంటారు. మధ్యాహ్నం సమయంలోనైతే రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం పది గంటలకే నిప్పుల కొలిమి తలపించే విధంగా తయారైదంటే పరిస్థితి అర్ధమవుతోంది. ఇక వేసవిలో ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి వర్ణనాతీతం.
భానుడి సెగలకు ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏంటి..?: ట్రాఫిక్ రద్దీలో గ్రేటర్ రహదారులపై వాహనాల నియంత్రణలో నిమగ్నం కావాలంటే ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఓ వైపు పరుగులు పెట్టే వాహనాలు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా వేడి వలన ట్రాఫిక్ పోలీసులకు ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మరి మండుటెండల్లో ఓ వైపు పై నుంచి భానుడి భగభగలు.. మరోవైపు వేడి గాలులు.. ఇంకోవైపు దుమ్మూధూళితో సతమతమవుతున్న ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏంటి..? వేసవి భగభగలకు వారు మండుటెండల్లో మాడిపోతూ విధులు నిర్వర్తిస్తున్నారు.