'తెలుగుతల్లిని దూషించిన కేసీఆర్... ప్లీనరీలో విగ్రహం పెట్టుకున్నడు' రాజకీయ లబ్ధికోసం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టింది కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy on Trs Plenary) అన్నారు. తెలుగు తల్లిని దూషించిన కేసీఆర్... ఇవాళ జరిగిన తెరాస ప్లీనరీలో మొట్టమొదట పెట్టింది తెలుగు తల్లి విగ్రహమేనని పేర్కొన్నారు. ఓయూకు ఇచ్చిన నిధులపై చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా.. అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలన్నారు. ఉద్యోగాలు లేక ఎందరో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న రేవంత్(Revanth Reddy on Trs Plenary)... నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు ప్రభుత్వానికి నివేదిక వచ్చిందని పేర్కొన్న రేవంత్... తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ చెప్పలేదా? అని అడిగారు. తెరాస నేతలపై ఉన్న ఉద్యమ కేసులు కొట్టివేయించుకున్నారని ఆరోపించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై మాత్రం కేసులు కొట్టివేయలేదని దుయ్యబట్టారు.
ఉద్యోగ ఖాళీలమీద, సింగరేణి కాలనీ ఖాళీల నియామకాల మీద, విద్యుత్ శాఖ ఖాళీలు, ఆర్టీసీ విధానంపై, నిరుద్యోగ సమస్యలపైన మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నర? శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని కేసీఆర్ను ప్రశ్నిస్తున్న. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకపాత్ర పోషించింది ఉద్యమకారులు. సకల జనుల సమ్మె నుంచి మిలియన్ మార్చ్ వరకు అనేక మంది కవులు, కళాకారులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ సమాజం మొత్తం నడుం బిగించి ఉద్యమంలో పాల్గొన్నరు. జేఏసీ ఆదేశిస్తే జెండాలు కట్టిండ్రు. కేసీఆర్ వస్తే దండాలు పెట్టిండ్రు. ఆయన కోరుకుంటే ప్రాణాలు అర్పించిండ్రు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత వీళ్ల మీద రైల్వే కేసుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన కేసులన్నింటిని కూడా మీరు తొలగించుకున్నరు. కానీ ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తొలగించలేదు. ఈరోజుకు కూడా కొనసాగుతున్నాయి. కేసుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు వందలాది మంది ఉన్నరు. వాళ్ల మీద కేసులు ఎందుకు తీయలేదు. కేసులు తీసేయడానికి ఏం అడ్డమొచ్చింది. ఉద్యమకారుల మీద కేసులపై చర్చించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇదీ చూడండి:KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్