Ticket Clashes in Telangana Congress :తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటించిన తర్వాత టికెట్ దక్కని నాయకులు అలకపూనుతున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంకొందరు పోటీ చేసి తీరతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) శుక్రవారం రాత్రి 45 మందితో కూడిన రెండో జాబితా ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Munugode Congress MLA Ticket Issue :మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy)కి ఇవ్వడంతో.. అక్కడ టికెట్ కోసం చివర వరకు వేచి చూసిన చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరిద్దరు కూడా కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. చలమల కృష్ణారెడ్డి చౌటుప్పల్‌లో కార్యకర్తలతో సమావేశమవుతుండగా.. పాల్వాయి స్రవంతి హైదరాబాద్ శివారులో జేవీ స్వాగత్ కన్వెన్షన్ హాలులో కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఇంతకాలం తమకే టికెట్ వస్తుందని ఇద్దరు పని చేసుకుంటూ పోతుండగా.. అప్పటికప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రాజగోపాల్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Congress Tickets War in Telangana :జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని భావించి గత కొంత కాలంగా పని చేసుకుంటూ వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డికి కాకుండా పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్‌కు ఇచ్చారు. ఖైరతాబాద్‌టికెట్ తనకు ఇవ్వకపోవడంపై కినుక వహించిన విష్ణువర్ధన్ రెడ్డి దోమలగూడలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. తాను ఐదు ఎన్నికలు చూశానని.. కానీ ఇలాంటి ఎన్నికలు చూడలేదని ఆరోపించారు. తాను తన కార్యకర్తల కోసం పోటీ చేసి తీరుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో ఇంట్లో రెండు టిక్కెట్లు ఇచ్చారని, తన ఇంట్లో రెండు టికెట్లు ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. పార్టీకోసం కష్టపడ్డానని, హైదరాబాద్ కాంగ్రెస్ అనగానే పీజేఆర్ గుర్తొస్తుందన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీలో ఉంటానని వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.