TRSPP: ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల లోపల బయట నిరసన వ్యక్తం చేయాలని... తెరాస ఆందోళన బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ (KCR) అధ్యక్షతన నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెరాస... ఇప్పటికీ విభజన హామీలను అమలు చేయక పోవడం... కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, ప్రోత్సాహకాలు లేకపోవడం వంటి అంశాలపై ధ్వజమెత్తుతోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ... పార్లమెంట్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని తెరాస భావిస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్రవిధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్ చేయనుంది.