కొత్త సచివాలయ నిర్మాణం కోసం వీలైనంత త్వరగా ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాలను యుద్ధప్రాతిపదికన తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు గతంలోనే స్పష్టం చేశారు. పక్షం రోజుల క్రితం సీఎస్ జోషి సహా ఇతర అధికారులు హడావుడిగా తమ కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్కు తరలించారు. కార్యాలయాన్ని తరలించినప్పటి నుంచి సీఎస్ సచివాలయంలోని తన కార్యాలయానికి రావడం లేదు. బీఆర్కే భవన్లో తన కార్యాలయం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం వల్ల కుందన్ బాగ్లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
శ్రీకారం చుట్టిన జయేశ్ రంజన్...
సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బీఆర్కే భవన్ నుంచే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. జపాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సచివాలయ సంబంధిత సమావేశాలకు జయేశ్ శ్రీకారం చుట్టారు. మిగతా కార్యదర్శులు, అధికారులు లాంఛనంగా బీఆర్కే భవన్లో కార్యాలయాలు ప్రారంభించినప్పటికీ.. కార్యకలాపాలను మాత్రం సచివాలయం నుంచే కొనసాగిస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు, విభాగాల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. సచివాలయంలో మూటగట్టిన దస్త్రాలు, ఇతరాలను బీఆర్కే భవన్లో ఇంకా సర్దుబాటు చేయలేదు. అక్కడ ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. కనీస వసతులు లేకుండా తాము విధులు ఎలా నిర్వహిస్తామని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.