తెలంగాణ

telangana

ETV Bharat / state

వంటింట్లో గ్యాస్‌ మంట.. సిలిండర్‌పై రూ.60 పెంపు - Rs 60 hike on cylinder latest news

వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గ్యాస్ గుదిబండలా మారుతోంది. ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి. మరోవైపు వంటిల్లు గ్యాస్ బండ మోత మోగిస్తోంది. సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.

వంటింట్లో గ్యాస్‌ మంట
వంటింట్లో గ్యాస్‌ మంట

By

Published : Dec 16, 2020, 6:34 AM IST

వంట గ్యాస్‌ ధరలు భగ్గుమన్నాయి. డిసెంబరులో రెండోసారి చమురు సంస్థలు సిలిండర్‌ ధరను పెంచాయి. ఈ నెల 2వ తేదీన గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండరు ధరను రూ.40 పెంచగా.. తాజాగా మంగళవారం రాత్రి మరో రూ.60 పెంచారు. దీంతో ఈ నెలలో మొత్తం రూ.వంద పెరిగి రూ.746.50కు చేరింది.

రెండు వారాల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఇంతలా పెంచిన దాఖలాలు ఎప్పుడూ లేవని వ్యాపారులు చెబుతున్నారు. సహజంగా ధరల నిర్ణయ సమయంలోనే రాయితీ ఎంత అన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి.. నగదు బదిలీ రూపంలో వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఈ నెలలో రెండు దఫాలు ధర పెంచినా రాయితీపై ప్రకటన లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ నెల 2 నుంచి సిలిండర్లు డెలివరీ తీసుకున్న వారికి రాయితీ సొమ్ము పూర్తిస్థాయిలో జమ కావడం లేదు. ఏడాదిలో 12 సిలిండర్లు తీసుకున్న వారికి మాత్రమే రాయితీ లభిస్తుంది. అంతకుమించి తీసుకునే సిలిండర్లకు మొత్తం ధరను భరించాల్సిందే.

రాష్ట్రంలో రోజుకు 1.80 లక్షల సిలిండర్ల సరఫరా

రాష్ట్రంలో రోజూ సగటున 1.80 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుత భారీ వడ్డింపుతో వినియోగదారులపై ఈ నెలలో సుమారు రూ.45 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. గ్యాస్‌ ధరలను పెంచుతూ పోతున్న తీరుకి.. ఇస్తున్న రాయితీ మొత్తానికి పొంతన ఉండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఉపాధి లేక విలవిల్లాడుతున్న సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై ఇది కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. వాణిజ్య సిలిండరు ధర కూడా పెరగటంతో వినియోగదారులపై భారం పడనుంది.

ABOUT THE AUTHOR

...view details