కరోనా కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షలతో దేశవ్యాప్తంగా పాలవిక్రయాలు పడిపోయాయి. హోటళ్లు, వివాహాది, శుభకార్యాలు, సామూహిక భోజనాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా కోటి లీటర్ల పాలు మిగిలిపోతున్నాయి. ఫిబ్రవరిలో తీవ్రకొరత ఉండగా లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. పలు రాష్ట్రాల్లో డెయిరీలు మిగిలిపోతున్న పాలతో....పొడి తయారు చేసి నిల్వచేస్తున్నట్లు జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి-ఎన్డీడీబీ వెల్లడించింది.
రోజుకు సగటున సుమారు 5.08 కోట్ల లీటర్లను... దేశవ్యాప్తంగా సహకార డెయిరీలు సేకరిస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు దేశంలో 70 వేల టన్నులుగా ఉన్న పాల పొడి నిల్వలు.. ఏప్రిల్ వరకు లక్షా 34వేల టన్నులకు పెరిగాయి. ఈ నెలాఖరు నాటికి... 2 లక్షల టన్నులు దాటిపోవచ్చని అంచనా. పాలపొడి ధర కిలో 350 నుంచి 250కు పడిపోయిందని ఎన్డీడీబీ తెలిపింది. ఐతే పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పన్నీరు వంటి అమ్మకాలు మాత్రం పెరిగాయని వెల్లడించింది.