కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. పాత భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. జే, ఎల్ బ్లాకుల్లో కొంత మాత్రమే మిగిలి ఉంది. ఈ వారంలో కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుందని, వ్యర్థాల తరలింపునకు మరో వారం సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ తరువాత మొత్తం ప్రాంగణాన్ని చదును చేస్తారు. నెలాఖరు వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తి కావచ్చని అంటున్నారు. అటు కొత్త సచివాలయ భవన సముదాయ నమునాకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏడు అంతస్థుల్లో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో కొత్త భవనం రానుంది. సచివాలయ ప్రాంగణంలోకి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు నాలుగు చొప్పున వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. భవనం నాలుగు వైపులా 60 అడుగుల వెడల్పుతో రహదార్లు కూడా రానున్నాయి. భూకంపాలను కూడా తట్టుకునేలా భవనాన్ని నిర్మించనున్నారు. భవనం ఈశాన్యంలో హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం - telangana
కొత్త సచివాలయ నమునాకు ఆమోదంతో తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. టెండర్ ప్రక్రియ చేపట్టడంతో పాటు భవన నిర్మాణానికి అవసరమైన అనుమతుల దిశగా రంగం సిద్ధం చేస్తోంది. అనుమతులన్నీ పొందాక అక్టోబర్ నెలలో పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలోగా నిర్మాణసంస్థను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి మంత్రి పేషీకి అనుబంధంగా కనీసం 50 మంది సమావేశమయ్యేలా సమావేశ మందిరాలను కూడా నిర్మించనున్నారు. నమూనాకు ఆమోదంతో తదుపరి ప్రక్రియను ప్రారంభించనున్నారు. అగ్నిప్రమాద నివారణ, పర్యావరణ అనుమతులు... ఆ తర్వాత భవన నిర్మాణ అనుమతి కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయనున్నారు. అనుమతులన్నీ వచ్చాకే భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనుమతుల కసరత్తుతో పాటు సమగ్ర ప్రణాళిక, అంచనా వ్యయాలను సిద్ధం చేస్తున్నారు. 400 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఆ తరువాత టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో నిర్మాణ సంస్థ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్మాణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం సహా అనుమతుల ప్రక్రియను పూర్తి చేసుకొని అక్టోబర్ నెలలో కొత్త భవన సముదాయ పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ.. బయోటెక్ రంగం బలోపేతానికి సూచనలు