Telangana Medical Colleges Increase: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ ఉన్నది 2950 ఎంబీబీఎస్ సీట్లు(MBBS Seats) మాత్రమే. అందులో ప్రభుత్వ విభాగంలోనివి 850 సీట్లే. ఇక 1180 పీజీ వైద్య విద్య సీట్లు(Medical Seats PG) ఉంటే అందులో 515 మాత్రమే ప్రభుత్వ విభాగంలో ఉన్నాయి. 2014 నుంచి వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ(ESI), ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు(AIMs Medical College) కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు(Telangana Medical Colleges) అందుబాటులోకి రాగా.. ప్రభుత్వ విభాగంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3915కి పెంచింది. పీజీ సీట్లు సైతం 1300లకు పైగా చేరటం గమనార్హం. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4 రెట్లు, పీజీ సీట్ల సంఖ్య 2.5 రెట్లు పెరిగినట్టు సర్కారు చెబుతుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య దాదాపు పదివేలకు చేరువగా ఉండటం విశేషం. దేశ సగటుతో పోలిస్తే ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. ప్రతి లక్షకు 8 పీజీ వైద్య విద్య సీట్లతో రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజు ఏడాదికి కేవలం పది వేలు ఉండగా.. ట్యూషన్ ఫీజు, ల్యాబ్ ఫీజులు కలిపి 25వేల లోపే ఉంది. దీంతోనే ఏడాది ఎంబీబీఎస్ చదువు పూర్తవుతుండటంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలకు కొత్త జీవం పోసినట్లు అవుతోంది. ఇక సొంత జిల్లాల్లోనే వైద్య కళాశాలలు ఉండటంతో తల్లిదండ్రులు ఆడపిల్లలను సైతం ఎంబీబీఎస్ వైపు ప్రోత్సహిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇంటి దగ్గర్లోని కాలేజీలో సీటు రావటం, ఫీజు తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకుంటున్నామని పలువురు విద్యార్థినులు చెబుతున్నారు.
8 ఏళ్లలో వైద్యకళాశాలల్లో 127శాతానికి సీట్లు పెరిగాయి: హరీశ్‌రావు
10 Thousand Medical College Seats for Telangana : ఒకప్పుడు తెలంగాణ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వెళ్లి వైద్యవిద్య అభ్యసించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకునే స్థాయికి వృద్ధి సాధించటం విశేషం. వైద్య విద్య పెంపుతో కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు.. చుట్టుపక్కల వారికి సైతం మెరుగైన వైద్యం అందేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు చిన్నాచితకా వ్యాధులకు సైతం రోగులను గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రిఫర్ చేసే వారు ఇప్పుడు అందుకు భిన్నంగా జిల్లా ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుండటం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆస్పత్రుల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా స్థాయిలోనే అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సర్కారు పూర్తి చేసిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన వారు తప్పని సరిగా ఏడాది కాలం పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనిక్ సహా పేదలకు దాదాపు 24 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికంగా ఉండే ఆస్పత్రుల్లోనే అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.