Telangana GSDP: కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడింది. కొవిడ్-19 నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్న పలు రంగాలు వృద్ధి బాటపడ్డాయి. రాష్ట్ర అర్థ గణాంకశాఖ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో రంగాల వారీ భాగస్వామ్యాన్ని విశ్లేషించింది. గత ఆర్థిక సంవత్సరం(2020-21) మొదట సవరించిన అంచనాలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రంగాలవారీగా వృద్ధిరేట్లను కేంద్ర గణాంకాలు, పథకాల అమలుశాఖ(ఎంఓఎస్‌పీఐ)కు అందించింది. కొవిడ్ మహమ్మారితో తయారీ రంగం; వాణిజ్యం; మరమ్మతులు; హోటళ్లు, రెస్టారెంట్లు; రైల్వేలు, విమాన రవాణాలు 2020-21లో దారుణంగా దెబ్బతినగా ఈసారి కుదుటపడ్డాయి.
విశ్లేషణ వివరాలు..
*ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, పశు సంవర్ధకం, అటవీ, మత్స్య పరిశ్రమ, మైనింగ్, క్వారీయింగ్‌లో 9 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైంది. ఈ రంగాల్లో అంతకుముందు ఏడాది వృద్ధిరేటు 8.8 శాతం.
*తయారీ, నిర్మాణం కీలకంగా ఉన్న ద్వితీయరంగాల్లో 2020-21లో వృద్ధిరేటు 0.3 శాతం తగ్గగా ఈసారి 21.5 శాతం పెరిగింది. అనుబంధ రంగాల్లో గత ఏడాది 0.9 శాతం వృద్ధిరేటు ఉండగా ఈసారి 18.3 శాతం నమోదైంది.
*తయారీ రంగంలో గత అభివృద్ధి ఐదేళ్లలోనే అత్యధికంగా 28.8 శాతంగా ఉంది.
*నిర్మాణ రంగంలో వృద్ధి అంతకుముందు కంటే 8.4 శాతం పెరిగింది.
*వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం సాధారణ స్థితికి చేరుకుంది.