Second Phase Kanti Velugu program in Telangana: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 18 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. దీంతో బాధితుల్లో అశలు చిగురిస్తున్నాయి. మొదటి విడత 2018 ఆగస్టు 15 నుంచి 2019 మార్చి 31 వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ ఆ తరువాత పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసింది. శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించినా ఇప్పటి వరకు చికిత్సలు చేయించలేదు. పలువురు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.
6 లక్షల 47 వేల 684 మందికి పరీక్షలు:జిల్లా జనాభా 9 లక్షల 85 వేల 417 కాగా మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 8 నెలల పాటు 18 మండలాల్లో 238 గ్రామాలు, 93 పురపాలక వార్డుల్లో 23 ప్రత్యేక బృందాలు గ్రామాలు. పురపాలక సంఘాల వారీగా క్షేత్రస్థాయిలో 2,474 వైద్య శిబిరాలు నిర్వహించి 6 లక్షల 47 వేల 684 మందికి కంటి పరీక్షలు చేశారు.
75 వేల 463 మందికి రీడింగ్ అద్దాలు అవసరమని గుర్తించి 72 వేల 316 మందికి అద్దాలు అందించారు. కళ్ల మధ్య తారతమ్యాలు ఉండేవారికి రెండు అద్దాలతో కూడిన కళ్లజోళ్లు 95 వేల 337 మందికి అవసరమని గుర్తించినా ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయారు. 15 రోజుల్లో వస్తాయని ప్రకటించినా అప్పటి నుంచి అధికారులు ఇదిగో అదిగో అంటూ రోజులు గడుపుతున్నారు.