స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు అవార్డులకు మరోసారి ఎంపికైనట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి లేఖ అందింది.
మన ఖాతాలో రెండు
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో ఉత్తమ్ ప్రతిభ, పనితీరు కనపరిచిన 20 జిల్లాలు అవార్డులకు ఎంపిక కాగా... అందులో రెండు మన రాష్ట్రానికి చెందినవే. ప్రపంచ టాయిలెట్స్ డే సందర్భంగా ఈ నెల 19న ఉదయం 11.30గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనుంది.
మంత్రి అభినందనలు
అవార్డులు దక్కిన రెండు జిల్లాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలియచేశారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన అభిప్రాపడ్డారు. అవార్డులు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.