విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (Electricity purchase agreements) నుంచి వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటును తెలంగాణ డిస్కం (Telangana Discoms)లు వినియోగించుకోదలిచాయి. రామగుండంలోని రెండు ప్లాంట్లు, నైవేలి లిగ్నైట్‌లోని ఒక ప్లాంటు నుంచి ప్రస్తుతం 481 మెగావాట్ల విద్యుత్తును కొంటున్నారు. ఈ మూడు ప్లాంట్ల నుంచి కొనుగోలును విరమించుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.450 కోట్లు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇకపై తమకు అందుబాటులో ఉన్న తెలంగాణ జెన్‌కో ప్లాంట్ల (TS GENCO Thermal Power Plant) నుంచి కరెంటు కొనాలని డిస్కంలు భావిస్తున్నాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (Power Purchase Agreement) (పీపీఏ)ల నుంచి వైదొలిగేందుకు అవసరమైన చర్యలను అధికారులు ప్రారంభించారు. ముందుగా విద్యుత్ నియంత్రణ మండలి (Electricity Regulatory Board)కి సమాచారం అందించటం, ఆరు నెలల ముందుగా నోటీసు పంపటం వంటి ప్రక్రియలు చేపట్టారు.
ఖర్చులు, ఛార్జీలు భారమని..
థర్మల్ కేంద్రాలతో ఒప్పందాలు పూర్తయి 25 సంవత్సరాలు పూర్తయితే కొనుగోలు నుంచి విరమించుకోవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. దీంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు పరిస్థితిని సమీక్షించాయి. రానున్న రోజుల్లో పెరుగుతున్న యూనిట్ ధరలను అంచనా వేసుకున్నాయి.