Telangana Congress MLA Candidates List Delay :రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆడుగులో అడుగు వేసుకుంటూ.. నత్తనడక నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని విధాల వేగం పెంచేందుకు సమాయత్తం అవుతోంది. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. మొదటి జాబితా (Congress MLA Candidates First List) అయినా ఈ వారంలో వస్తుందని అంచనా వేసిన ఆశావహులకు నిరాశనే మిగిలింది. ఆలస్యమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Congress MLA Tickets Issue :ఇప్పటి వరకు వందకు పైగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వామపక్షాలు ఎటూ తేలకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారుండడంతో.. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం మరికొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) విడుదల కావడంతో.. అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే ఎన్నికల్లో అన్నిరకాల నష్టపోయే ప్రమాదం ఉందని ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Telangana Congress MLA Candidates Selection Process :ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఎలాంటి వివాదంలేని నియోజకవర్గాలకైనా అభ్యర్థులను ప్రకటన చేయాలన్న యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చిన ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో స్పష్టత రావాల్సి ఉంది. అందరికి ఒకేసారి ప్రకటిస్తారా.. లేక వివాదంలేని ఏకాభిప్రాయానికి వచ్చిన 60కి పైగా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు చొరవ చూపుతారా.. అనేది కాంగ్రెస్ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత వెల్లడవుతుందని భావిస్తున్నారు.
Congress MLA Candidates List Telangana 2023 :అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ(Congress MLA Candidates Selection)ను అలా పక్కన పెడితే.. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్సు యాత్ర(Bus Yatra) ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన పీసీసీ.. రేపటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధివిధానాలపై చర్చ జరుగుతుందని వెల్లడిస్తోంది. ప్రధానంగా బస్సు యాత్ర ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కొనసాగాలి.. ఏయే పార్లమెంటు నియోజకవర్గాలు ద్వారా బస్సు యాత్ర సాగితే ఎక్కువ నియోజకవర్గాలు తక్కువ సమయంలో కవర్ అవుతాయన్న దానిపై చర్చ జరగనుంది.