రాష్ట్ర మంత్రివర్గం మరికొద్దిసేపట్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిశాయి. అప్పటి నుంచి ఆర్నెళ్లలోపు అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. దీంతో సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించనున్నారు. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరగనుంది. గృహ నిర్మాణ సంస్థ, కొండాలక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలకు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాటి స్థానంలో ఉభయసభల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. దళితబంధు పథకంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. హుజూరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. దీంతోపాటు దళితబంధు పథకం అమలు, కార్యాచరణ, లబ్ధిదారులకు యూనిట్ల ఎంపిక, మంజూరు సహా సంబంధిత అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు సంబంధించిన బిల్లు రూపకల్పనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చ..
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ కసరత్తు దాదాపుగా పూర్తైంది. 65 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. నియామకాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వరిధాన్యం సాగు అంశం కూడా ప్రస్తావనకు రానుంది. బాయిల్ట్ రైస్‌ను కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. కొనుగోళ్లు, యాసంగిలో సాగుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆయిల్ పామ్ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వాటితో పాటు ప్రాజెక్టులు, జలవివాదాలు, సంబంధిత అంశాలపై కూడా కొత్త మైనింగ్ పాలసీపై కేబినెట్లో చర్చ జరగనుంది. మైనింగ్‌లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కొత్త మైనింగ్ పాలసీపై కేబినెట్లో చర్చ జరగనుంది.