Telangana BJP Plan to Intensify Election Campaign :కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారా అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పార్టీ ప్రచారాలను ఉద్ధృతం చేసేలా హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూసీఎం కేసీఆర్రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే కేంద్ర జల్‌శక్తి శాఖకు తానే ఫిర్యాదు చేశానన్నారు.
ప్రజల సొమ్ముతో కడుతున్న ప్రాజెక్టు నాణ్యతను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. తాను ఉత్తరం రాసిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పందించారని తెలిపారు. కేంద్రం నుంచి వెంటనే ఆరుగురు సభ్యుల బృందం వచ్చి మేడిగడ్డను పరిశీలించినట్లు వివరించారు.
'పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యింది'
రాష్ట్రంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు హైదరాబాద్‌లో మీడియా సెంటర్‌ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీ ప్రకాశ్ జావడేకర్(Prakas jawadekar) ప్రారంభించారు. రాష్ట్రంలోని బీజేపీ అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం.. నేడు తెలంగాణకు గుదిబండగా మారిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టు కట్టామని చెప్పిన ప్రభుత్వం.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగిన వివరాలు లేవనటం హాస్యాస్పదమన్నారు. కట్టిన నాలుగేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయని.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు వివరించారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని ఆక్షేపించారు.