TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు రూల్‌కర్వ్స్ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ తెలంగాణ పలుమార్లు కోరిన నేపథ్యంలో తాజాగా సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ)-58వ సమావేశం నివేదికను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అందజేసింది. కానీ తెలంగాణ నీటిపారుదలశాఖ తాము కోరుతున్న సమాచారం అది కాదని కృష్ణా బోర్డుకు నివేదించినట్లు సమాచారం. జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్‌కర్వ్స్‌ను మరోమారు రూపొందిస్తూ (రివైజ్డ్) డ్రాఫ్ట్ నివేదికను తయారు చేసిన విషయం తెలిసిందే.
దీనిలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి, తెలంగాణకు పలు ఔట్‌లెట్ల ద్వారా కేటాయింపులు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ వివరాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రివైజ్డ్ రూల్‌కర్వ్స్ రూపకల్పనకు ఏ ప్రమాణాలను అనుసరించారని, ప్రామాణికతలు ఏంటో తెలియజేయాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పలు లేఖలు రాశారు. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఏ ఒప్పందాలు, ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నారో ఆధారాలు అందజేయాలని తెలంగాణ కోరింది.