రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో అక్రమ లేఔట్ల స్థలాలు, భవనాలకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కమిషనర్ల లేఖల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు తక్షణమే అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 30 మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. కమిషనర్ల నుంచి లేఖలు అందిన వెంటనే మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు. దీని వల్ల అక్రమ లేఔట్ల్లు- అనధికారిక భవన నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.
లేఖలు రాశారు
కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం పురపాలక సంఘాల పరిధిలో అనుమతి లేకుండా వేసిన వెంచర్లలో స్థలాలను అనధికారిక భవనాలను రిజిస్ట్రేషన్ చేయకూడదు. పక్కాగా నిషేధం అమలు చేయాలి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంలో కఠినంగా ఉండమని కమిషనర్లను కోరారు. దానితో కొంతమంది ఫిబ్రవరి 22 నుంచే రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖలు రాశారు. 'మా పట్టణ పరిధిలో ఫలానా ఏరియాలో అక్రమ లేఔట్ల్ ఉంది. ఫలానా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేశారు. సంబంధిత సర్వే నంబరులో ఇళ్లు, స్థలాలు రిజిస్టర్ చేయొద్దు'అని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు.