Godavari River Management Board: కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు భూ సేకరణ చేస్తున్నారంటూ శ్రీరాం గంగాజమున, చెరకు శ్రీనివాసరెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం పిటిషన్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ వాదనలు వినిపించారు. ‘‘అనుమతుల్లేకుండా మూడో టీఎంసీ పనులు చేపట్టవద్దని జల్‌శక్తిశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విస్తరణ పనులపై నివేదికలు సమర్పించాలని కోరింది. అనుమతులు లేకుండా పనులు సాగించరాదని జాతీయ హరిత ట్రైబ్యునల్ సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం 2 టీఎంసీల ప్రాజెక్టుతోనే పంపుహౌస్‌ల మునక వంటి సమస్యలు తలెత్తాయి. మరో టీఎంసీ పనులకు అనుమతిస్తే జరగబోయే నష్టాలపై అధ్యయనం చేయాలి’’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.