SBI Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. రాష్ట్రాలవారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేస్తే ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలి. ఇవి క్లరికల్ క్యాడర్ పోస్టులు కావడం వల్ల దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పనిచేయాలి. ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన తర్వాత.. జాతీయ స్థాయి క్యాడర్ కిందికి వస్తాయి. అప్పుడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం వస్తుంది.
తొలిసారి ప్రాంతీయ భాషలో:జూనియర్ అసోసియేట్ పరీక్షను మొదటిసారిగా ప్రాంతీయ భాషలో నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్, హిందీపాటు తెలుగు, ఉర్దూల్లోనూ పరీక్ష రాయొచ్చు. తెలుగును ఎంచుకుంటే ఇంగ్లిష్, తెలుగులో, ఉర్దూను ఎంచుకుంటే ఇంగ్లిష్, ఉర్దూలో పరీక్ష ఉంటుంది. ఈ ఏర్పాటు అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరం.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష:ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్:మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలుంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు.. 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు..40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు...50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు... 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. సెక్షన్ల వారీ సమయాన్ని నిర్దేశించారు.
సన్నద్ధత ఎలా?
ప్రిలిమ్స్ పరీక్ష నవంబరు, 2022లో ఉంటుంది. అంటే సన్నద్ధతకు సుమారుగా రెండు నెలల సమయం ఉంది.
* ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరుగా కాకుండా రెండింటికీ కలిపే సన్నద్ధత మొదలుపెట్టాలి.
* నంబరింగ్, రీజనింగ్, ఇంగ్లిష్ -ఈ సబ్జెక్టులు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉంటాయి. మెయిన్స్‌లో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అదనంగా కంప్యూటర్స్ ఉంటుంది. వీటికి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి.
* కరెంట్ అఫైర్స్‌లోని ముఖ్యాంశాలను నోట్‌పుస్తంలో రాసుకోవాలి.
* న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు, నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 5 ప్రశ్నల వరకూ వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 5 నుంచి 10 ప్రశ్నలు, అరిథిమెటిక్ టాపిక్స్ నుంచి 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌లో సిట్టింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్ నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, ఇన్‌ఈక్వాలిటీస్... మొదలైన వాటి నుంచి 1 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఈ అంశాలను సాధన చేయాలి.
* స్టేట్‌మెంట్ సంబంధ యాంటీ లాజికల్/ లాజికల్ ప్రశ్నలు మెయిన్స్‌లో వస్తాయి.
* ఇంగ్లిష్‌లో గ్రామర్ ఆధారంగా, రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీల నుంచి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల గ్రామర్ మీద మంచి పట్టు సాధించాలి. హైస్కూల్ స్థాయిలో నేర్చుకున్న గ్రామర్‌ను ఒకసారి మననం చేసుకుంటే పరీక్ష సులువుగా రాయగలుగుతారు. వీలైనంత ఎక్కువగా సాధన చేయాలి.
మొదటిసారి రాస్తుంటే:ఈ అభ్యర్థులు ఆప్టిట్యూడ్/ రీజనింగ్ అంశాలు బాగా నేర్చుకోవాలి. వీటికి సంబంధించిన వివిధ ప్రశ్నలను సాధన చేయాలి. సన్నద్ధత సమయాన్ని విభజించుకుని మొదటి నెలలో ప్రతిరోజూ టెస్ట్ రాయాలి. ఇలా చేయడం వల్ల తాము ఏ స్థాయిలో ఉన్నారనే విషయంలో అభ్యర్థులకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఎక్కడ తప్పులు చేస్తున్నారో.. ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయో తెలుసుకుని ఆయా అంశాలను మరింత శ్రద్ధగా నేర్చుకోగలుగుతారు. మెయిన్స్‌కు తగినంత సమయం ఉంటుంది కాబట్టి కంగారుపడకుండా వీలైనంత ఎక్కువ సమయాన్ని సాధనకు కేటాయించాలి.
ఎవరు దరఖాస్తు చేయొచ్చు?
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవాళ్లు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే నవంబరు 20, 2022 నాటికి డిగ్రీ ఫలితాలు రావాలి.
వయసు: ఆగస్టు 1, 2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్లు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ (జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.09.2022
ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు, 2022
మెయిన్ పరీక్ష: డిసెంబరు 2022/ జనవరి 2023లో జరుగుతుంది.