గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యావంతులు ఎక్కువగా బరిలో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఎక్కువ సంఖ్యలో విద్యావంతులు పోటీ చేస్తున్నారు. గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్లకు 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పీహెచ్డీ చదువుకున్న వారితో పాటు నిరక్షరాస్యులు సైతం కొందరు పోటీ చేస్తున్నారు. అసిఫ్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పీహెచ్డీ పూర్తి చేసిన లుబ్నా సార్వంత్ పోటీలో నిలిచారు. వీరితో పాటు ఆరుగురు వైద్యులు సైతం బరిలో నిలిచారు.
ఇంటర్ నుంచి ఎంటెక్ వరకు...
ఎంటెక్ చదివిన వారు ముగ్గురు, బీటెక్ చదివిన వారు 14 మంది గ్రేటర్ వార్‌లో తలపడుతున్నారు. న్యాయశాస్త్రం చదివిన వారు 13 మంది, పీజీలు చేసిన వారు 98 మంది, గ్రాడ్యుయేషన్ చేసిన వారు 220 మంది నగరంలోని పలు డివిజన్ల నుంచి పోటీ చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన 345 మంది, డిప్లొమా 5, ఇంటర్మీడియట్ 68 మంది పోటీ చేస్తున్నారు.
39 మంది నిరక్షరాస్యులు...
పదో తరగతి చదివిన వారు 159, తొమ్మిదో తరగతి చదివిన వారు 17 మంది, ఎనిమిదో తరగతి చదివిన వారు 10, ఏడో తరగతి చదివిన వారు 22, ఆరో తరగతి చదివిన వారు 4, ఐదో తరగతి 7 గురు, నాలుగో తరగతి ఇద్దరు, ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకున్న వారు ఒకరు, పదో తరగతి ఫెయిలైన వారు నలుగురు, విద్యార్హతలు చెప్పని వారు 50 మందికి పైగా ఉన్నారు. నిరక్షరాస్యులు 39 మంది నగరంలో పోటీ చేస్తున్నారు.
నల్లకుంట నుంచి సమ్రీన్...
నల్లకుంట నుంచి ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల అమీనా సమ్రీన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. 21 ఏళ్ల వయస్సున్న వారు మొత్తం 8 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు బరిలో ఉన్నారు. 75 ఏళ్ల సూర్యనారాయణ తెరాస జూబ్లీహిల్స్ డివిజన్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 71 ఏళ్ల వయస్సు గల కొప్పు రాజయ్య మల్కాజిగిరి స్వతంత్ర అభ్యర్థిగా గ్రేటర్లో పోటీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:సూటిగా అడుగుతున్నా.. సుత్తిలేకుండా చెప్పండి : మంత్రి కేటీఆర్