చలి పులి పంజా విసిరింది. నివర్ తుపాను తర్వాత ఏపీ జిల్లాల్లో మరింత తీవ్రమైంది. రాత్రే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం కాగానే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలైనా వణుకు తగ్గడం లేదు. సహజంగా డిసెంబరు మొదటి వారంలో చలి ప్రభావం కనిపిస్తుంది. ఈసారి నివర్ తుపాను మూలంగా పది రోజులు ముందుగానే చలి గాలులు మొదలయ్యాయి. ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. సంక్రాంతి వరకూ ఈ ప్రభావం ఉంటుందని రేకులకుంట వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సీజన్‌లో అతి తక్కువగా మంగళవారం కనిష్ఠంగా 19.1, గరిష్ఠంగా 30.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మంచు కురుస్తోంది
అనంతపురం జిల్లాలో రాత్రి కంటే పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఉదయం 9 గంటలైనా వణుకు తగ్గడం లేదు. ఇక సాయంత్రం 5 గంటలకే ప్రభావం మొదలవుతోంది. కిటికీలు, తలుపులు మూసుకున్నా ఇళ్లల్లోకి చలిగాలులు చొరబడుతున్నాయి. బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. రాత్రి 8 గంటలు కాగానే ప్రధాన పట్టణాల్లో జన సంచారం ఏమాత్రం కనిపించడం లేదు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 దాకా మంచు కురుస్తోంది. రహదారులు కనిపించడం లేదు.