‘‘రాత్రి, పగలు ఆ ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నాడు.. తినేందుకు పిలిచినా స్పందించడం లేదు. డిగ్రీ పూర్తయి ఇన్ని రోజులవుతున్నా ఉద్యోగం మాటెత్తడం లేదు. అసలేం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు..’’ ఇది నగరానికి చెందిన ఓ యువకుడి తల్లి ఆవేదన..
‘‘మొన్నటి వరకు నాతోపాటే ఉద్యోగం చేసేవాడు.. ఇప్పుడు ఏ పనీ చేయడం లేదు. ఎప్పుడు చూసినా డేటింగ్ యాపుల్లోనే ఉంటున్నాడు. కొత్త పరిచయాల కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నాడు..’’ తన మిత్రుడి విషయంలో ఓ యువకుడి ఆందోళన..
సమయాన్ని మర్చిపోతున్నారు
స్మార్ట్‌ఫోన్, సామాజిక మాధ్యమాలు, పోస్టింగ్‌ల విషయంలో తగ్గిన ఆసక్తి ఇప్పుడు పబ్జీలాంటి ఆటలు, డేటింగ్ యాప్‌లపై పెరిగిందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. వీటిపై ఆసక్తి పెరగడంతో యువత చదువు, ఉద్యోగాన్ని పక్కనపెడుతున్నారు. బుర్రలు మొత్తం ఇవే ఆలోచనలతో నింపేస్తున్నారు. డేటింగ్ యాప్‌ల్లో సమయం గడిపేవారు కొత్త పరిచయాల కోసం రూ. వేలల్లో ఖర్చు చేస్తున్నారు. వాటిలో ఉండే గోల్డ్, డైమండ్ తదితర స్థాయిలను చేరేందుకు అప్పు చేసి మరీ డబ్బు దుబారా చేస్తున్నారు.
ఉద్యోగాలూ మానేస్తున్నారు
సోషల్ యాప్‌లకు బానిసలవడంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారు కొందరైతే.. స్వతహాగా మానేస్తున్న వారు మరికొందరు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వారు సైతం వీటికి బానిసలై ఉద్యోగ ప్రయత్నాలకు పూర్తిగా దూరమై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువులకు సమయం కేటాయించలేకపోతున్నారు. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
మత్తు పదార్థాల కన్నా ప్రమాదకరమైన వీటిని వదిలించుకునేందుకు కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. వాటిలో కొన్ని..
- డిజిటల్ వెల్‌బీయింగ్: ఆండ్రాయిడ్‌పై ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ఈ టూల్‌ను డెవలప్ చేసింది. దీంతో స్మార్ట్‌ఫోన్‌లో మీరు రోజులో ఎంత సమయం గడుపుతున్నారు..? ఎంతవరకు గడపాలో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ప్రతి యాప్‌పై నివేదికలు పొందొచ్చు. ఉదాహరణకు పబ్జీని రోజుకు 15నిమిషాలే ఆడాలనుకుంటే ముందుగానే టైం సెట్ చేయాలి. అనంతరం యాప్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
- యాక్షన్ డ్యాష్:ఇదీ డిజిటల్ వెల్‌బీయింగ్ లాంటి యాపే.. ఇందులో ఎలాంటి సమయాన్ని నిర్దేశించే ఫీచర్ లేకపోయినా పక్కాగా వారాంతపు నివేదికలు పొందొచ్చు. వీటి ఆధారంగా ఆడే సమయాన్ని గమనించి తగ్గించుకోవచ్చు.
- స్పేస్: ఈ యాప్‌తో సోషల్ యాప్‌లను నియంత్రిచొచ్చు. వాటికి నిర్దేశించిన గడువు దాటగానే హెచ్చరిక జారీ చేస్తుంది. దీంతో ఎక్కువ సమయం వృథా కాకుండా ఉంటుంది.
- యాప్ డిటోక్స్:ఇది స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించుకునేందుకు ఉపయోగపడుతుంది. యాప్‌ల వాడకానికి ఓ గడువు పెట్టుకున్న తర్వాత ఎప్పటికీ అదే గడువు ఉండేలా చేస్తుంది. నెమ్మదిగా సోషల్ యాప్‌ల వాడకానికి దూరమయ్యేలా సహకరిస్తుంది.
- స్క్రీన్ టైమ్: దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ వినియోగదారు ఎంతసేపు ఆన్‌స్క్రీన్‌లో ఉంటున్నారో తెలుసుకోవచ్చు. ఇందులోనూ యాప్‌ల వాడకానికి గడువును నిర్దేశించుకొని వాటి నుంచి విముక్తులవ్వొచ్చు.
విచక్షణ కోల్పోతున్నారు
రోజంతా సామాజిక మాధ్యమాలు, సోషల్ యాప్‌లలో గడపడంతో యువతలో ఆలోచనా శక్తి తగ్గి మానసిక ఒత్తిడి పెరుగుతోంది. విచక్షణ శక్తిని కోల్పోతున్నారు. భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యం తగ్గుతోంది. వెరసి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటికి బానిసవడంతో మానసిక, శారీరక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. యాప్‌ల వినియోగంపై స్వీయ నియంత్రణ అవసరం. ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి అనుకున్నప్పుడు మానసిక వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
- డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్యులు