సూర్యుడు... సమస్త జగతికీ మూలాధారం. కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతోపాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి... అంటే సూర్యుడి పుట్టిన రోజు. ఆదిత్యుడి రథాన్ని గమనిస్తే... దానికి ఒక చక్రం, ఏడు అశ్వాలు ఉంటాయి. ఆ చక్రం కాలచక్రమైతే... సూర్యుడి కిరణాలే ఆ అశ్వరూపాలు. సప్త అనే అశ్వం ఆ రథాన్ని లాగుతుంటుంది.
ఆరు కిరణాలు ఆరు రుతువులుగా
ఆదిత్యుడి నుంచి ఉత్పన్నమయ్యే కిరణాల్లో ఏడో కిరణం సప్త అనే నామంతో ఉంటే... మిగిలిన ఆరు కిరణాలు ఆరు రుతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటోంది వేదం. రవి మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమి సమయంలో సూర్యకిరణాలు నేలపై పుష్కలంగా పడతాయంటారు. ఆ శక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లు, పారే నీటిపైన ఎక్కువగా ఉంటుంది.
రేగుపండ్లనీ తలమీద పెట్టుకుని స్నానం
అందుకే రథసప్తమి నాడు చేసే పూజ, స్నానం ఎంతో విశిష్టమని చెబుతారు. ఈ రోజున ఏడు జిల్లేడు లేదా రేగు ఆకుల్నీ, రేగుపండ్లనీ తలమీద పెట్టుకుని స్నానం చేయాలంటారు. సూర్యుడికి జిల్లేడు ఆకులు ఎంతో ప్రీతికరమైనవి. ఈ స్నానం ఏడు జన్మల పాప కర్మలను నశింపచేస్తుందని పురాణాలు చెబితే, దీనివెనుక ఆరోగ్య రహస్యమూ ఉందంటున్నాయి శాస్త్రాలు. సూర్యకిరణాలు పడిన జిల్లేడు లేదా రేగుఆకులనూ రేగుపండ్లనూ తలపైన పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆ తరువాత వచ్చే వేడిని- అంటే వేసవిని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుందంటారు.
ఆరోగ్య ప్రదాతగా...
సూర్యుడికి నేరుగా నమస్కరించడం ఒక పద్ధతైతే రకరకాల నామాలతో అర్చించడం మరో పద్ధతి. ఆదిత్యుడిని పూజించే నామాలు రామాయణ, మహాభారత సమయాల్లో ఉద్భవించాయి. పురాణాలను గమనిస్తే... రాముడు రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయి, నిస్తేజానికి లోనైనప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయాన్ని ప్రభోదించాడట. ఆ తరవాతే రాముడు అపారమైన శక్తితో రావణుడిని సంహరించాడని వాల్మీకీ రామాయణం చెబుతోంది. ధర్మరాజు కూడా దౌమ్యుడి ద్వారా సూర్య అష్టోత్తర సహస్రనామాల్ని తెలుసుకుని జపించాడని భారతంలో ఉంది.
శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది
కృష్ణుడి కుమారుడు సాంబడు తనకు వచ్చిన కుష్టువ్యాధిని సూర్యారాధన చేసే తగ్గించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అవి చదివినా, చదవకపోయినా... ఈ రోజున సూర్యారాధన చేయడంలో ఆరోగ్యరహస్యమూ దాగుంది. రథసప్తమి రోజు పొద్దున్నే స్నానం చేశాక... ఆరు బయట ఆవుపిడకల మంట మీద పరమాన్నం వండి... సూర్యుడికి నివేదించాలంటారు. ఆరుబయటే పరమాన్నం చేయడం, భాస్కరుడికి నివేదించే క్రమంలో ఆ పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడతాయి. అలా నివేదించిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.