నదీ ఆనవాళ్లు కోల్పోయి మురికి కూపంగా మారిన మూసీనది ఇటీవలి వర్షాలకు కొత్తరూపు సంతరించుకుంది. లంగర్‌హౌస్ వద్ద ఈసీ-మూసీ నదుల సంగమం అత్తాపూర్, పురాణాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, నాగోల‌్, ఉప్పల్ వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర హైదరాబాద్‌లో మూసీ నది ప్రవహిస్తోంది. మూసీకి ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీల్లో... వేలాది మంది నివాసం ఉంటున్నారు. వరదలతో వీరంతా ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంతో కాస్త సేదతీరుతున్నారు. దశాబ్దాలుగా మురుగు కంపును భరించామని.... ఇప్పుడు పరిశుభ్రమైన మూసీని చూస్తున్నామని చెబుతున్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్లాస్టిక్ కవర్లు, పిచ్చి మొక్కలతో మురుగు కంపు భరించలేని విధంగా ఉండేది. మూసీ నది ఇటీవల వరదలతో కడిగేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి దుర్వాసన రావట్లేదని ప్రయాణికులంటున్నారు.
ఇప్పటికైనా పరిశుభ్రంగా ఉంచాలి
2000 సంవత్సరంలో మూసీ ప్రక్షాళనకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' ప్రాజెక్టును చేపట్టింది. నది మధ్యలో నుంచి మురుగునీరు వెళ్లేందుకు వరద కాలువను నిర్మించి... ఇరువైపులా నందనవనాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మూసీని ఆక్రమించి నిర్మించిన బస్తీలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. బస్తీలను ఖాళీ చేయించడంపై మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా మూసీని పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.