సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి బలమైన పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ అధికార తెరాస నుంచి బరిలో ఉన్నారు. భాజపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నాలుగోసారి తలపడుతున్నారు. జనసేన అభ్యర్థిగా శంకర్ గౌడ్ బరిలో ఉన్నారు. మొత్తం 28 మంది పోటీలో నిలిచానా పోటీ మాత్రం తెరాస, భాజపా మధ్యే సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం అంతంతే ఉండడంతో ద్విముఖ పోటీ నెలకొంది.
గులాబీ జెండా ఎగురవేయాలని
సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, సనత్ నగర్, అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నాంపల్లి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజవర్గాల్లో తెరాస అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి గెలుపొందని గులాబీ పార్టీ... ఈసారి ఈ స్థానంలో పాగా వేయాలని పట్టుదలతో ప్రచారం చేసింది. ఎమ్మెల్యేల అండతో పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని గులాబీ దళం ప్రయత్నం చేసింది.
తలసాని శ్రీనివాస్ తనయుడు సాయికిరణ్ యాదవ్కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా.. ఎమ్మెల్యేల సాయంతో జోరుగా ప్రచారం సాగించారు. కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. తెరాస పథకాలే తమను గెలిపిస్తాయని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నారు.