ఒకవైపు సిమెంటు, ఇనుము ధరలు భారీగా పెరిగి ఇంటి నిర్మాణ వ్యయం తడిసి మోపెడు అవుతుండగా, ఇసుక ధరలు మాత్రం ఊరట కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఇసుకకు డిమాండ్ ఎక్కువ కావడంతో ధర కూడా పెరుగుతుంది. ఈసారి అందుకు భిన్నంగా ఉంది. గత వేసవిలో రూ. 2,500 పైనే ధర పలికింది. వానాకాలంలో సరఫరా తగ్గి టన్ను రూ. 4,500 వరకు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం టన్ను లోడ్ దొడ్డు రకం రూ. 1,400కు, సన్న ఇసుక రూ. 1,500- 1,550కే దొరుకుతోంది. ప్రస్తుతం ధర తక్కువే ఉన్నా కొనేవారి కోసం ఇసుక వ్యాపారులు, లారీల యజమానులు ఎదురుచూస్తున్నారు.
ఏమిటి కారణం?
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గతంలో 28-30 రీచ్‌లు ఉండేవి. నిల్వలు తరిగిపోవడంతో ప్రస్తుతం 10 రీచ్‌ల నుంచే ఇసుక లభిస్తోంది. ఆ లోటును భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో రీచ్‌లు తీరుస్తున్నాయి. ఇక్కడ గోదావరిలో 12 రీచ్‌ల నుంచి పుష్కలంగా ఇసుక లభిస్తోంది. ఫలితంగా ధరలు అందుబాటులో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా కొత్తగా పెద్దసంఖ్యలో ఇసుక రీచ్‌లు రాబోతున్నాయి. దీంతో సరఫరా మరింత పెరగనుంది. ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 38 రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది. శనివారం ఆన్‌లైన్‌లో 42,400 క్యూబిక్ మీటర్ల మేర విక్రయానికి పెడితే 31,182 క్యూబిక్ మీటర్లే బుక్ అయింది. గత కొద్దిరోజులుగా అమ్మకాలు 30, 31 వేల క్యూబిక్ మీటర్లు దాటడం లేదు. గతంలో బుకింగ్ మొదలైన నిమిషాల్లోనే ఇసుక అయిపోయేది. ఇప్పుడు ఏ సమయంలో ప్రయత్నించినా దొరుకుతోంది.