జంటనగరాల్లో రహదారులు దాటాలంటే.. పాదచారులు పడరాని పాట్లు పడాల్సిందే. ఎటు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందో తెలియదు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడతారు. పాదచారులు రోడ్డు దాటే క్రమంలో వాహనాలను నియత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్ రహదారులపై దర్శనమివ్వనుంది. సులభంగా రహదారులు దాటే విధంగా ఇది పనిచేయనుంది.
రోడియో
పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతవరకైనా తగ్గించాలని రోబోటిక్స్ అనే సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు రోడియో అనే చిన్న సైజు రోబోను రూపొందించారు. పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనదారులను రోడియో అప్రమత్తం చేస్తుంది. సైగలు, హెచ్చరిక శబ్దాల ద్వారా వాహనదారులను నియంత్రించనుంది.
5 గంటలపాటు
రోబోను వాహనాల్లో వినియోగించే బ్యాటరీల ద్వారా ఛార్జింగ్ చేస్తారు. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ అయిన తర్వాత అయిదు గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. రోబో మధ్యలో ఉండే తెరలో ట్రాఫిక్ నియమ, నిబంధనలు సూచిస్తుంది. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు దీన్ని వినియోగిస్తున్నారు.
ఆరుగురు విద్యార్థులు
ఆరుగురు విద్యార్థులు కలిసి రోడియోను రెండు నెలల పాటు శ్రమించి రూపొందించారు. మరింత అభివృద్ధి చేసి రహదారులపై వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ రోడియోను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై ఈ తరహా రోబోలను వినియోగించాలని భావిస్తున్నట్లుఆయన తెలిపారు.
ఇవీ చూడండి:ఫిల్మ్‌సిటీలో మహిళల సందడి