తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2023, 6:46 AM IST

ETV Bharat / state

రవాణా శాఖ ఆదాయం.. రయ్‌..రయ్‌

telangana transport department Revenue : రాష్ట్ర రవాణాశాఖ ఆదాయపరంగా పరుగులు పెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య, మరోవైపు పన్నుల మోతతో దాని ఆదాయం అంచనాలు దాటుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేని రవాణాశాఖ.. ప్రస్తుత ఏడాదిలో మాత్రం ఆదాయార్జనలో పరుగులు పెడుతోంది.

rta
rta

telangana transport department Revenue : ఆదాయపరంగా రాష్ట్ర రవాణాశాఖ దూసుకెళ్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య మరోవైపు పన్నుల మోతతో దాని ఆదాయం అంచనాలు దాటుతోంది. 2022 జనవరి నుంచి డిసెంబరు వరకు సుమారు ఆరులక్షల వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. రూ.4,811 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది మే నెలలో వాహనాల జీవితకాల పన్నును ప్రభుత్వం పెంచటంతో ఆదాయమూ భారీగా వృద్ధి చెందుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేని రవాణాశాఖ.. ప్రస్తుత ఏడాదిలో మాత్రం ఆదాయార్జనలో పరుగులు పెడుతోంది.

2022-23లో వాహనాల రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.4,953 కోట్లు రాబట్టాలనేది నిర్దేశిత లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.4,811 కోట్లు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా మూడు నెలలున్నా లక్ష్యానికి కేవలం అది రూ.142కోట్ల దూరంలోనే ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ఆదాయం రూ.6,000 కోట్లు దాటేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2021-22లో ప్రభుత్వం రూ.5,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్నివ్వగా ఈ శాఖకు లభించింది రూ.3,953 కోట్లే.

1,955 వాహనాలు.. ఆదాయం రూ.290కోట్లు :అధిక ధరల వాహనాలు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గత డిసెంబరులో రూ.50లక్షలకు మించిన ధర పలికే వాహనాలు 1,955 రిజిస్టర్‌ అయ్యాయి. వీటిలో ఖరీదైన బైకులు, కార్ల ద్వారా పన్నుల రూపంలో రూ.289.77 కోట్లు లభించాయి. 2021లో ఇలాంటి 10,321 వాహనాల రిజిస్ట్రేషన్‌ ద్వారా ఏడాదంతా కలిపి వచ్చిన ఆదాయం రూ.483.05కోట్లు మాత్రమే.

కార్లు పెరిగాయి...గత డిసెంబరులో కార్లు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. వచ్చే ఏప్రిల్‌ నుంచి దేశంలోని పలు నగరాల్లో బిఎస్‌-6 వాహనాల రిజిస్ట్రేషన్‌ నిలిపివేసే అవకాశం ఉంది. సంబంధిత ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని అధికారులు చెబుతున్నారు. ఆ నగరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కూడా ఉంది. ఏప్రిల్‌ నుంచి ఆయా నగరాల్లో బీఎస్‌-6.2 ఇంజిన్లతో తయారుచేసిన వాహనాలనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు ఉన్న వాహనాలను విక్రయించేందుకు రాయితీలు ఇస్తుండటంతో విక్రయాలు పెరిగాయి. 2021 డిసెంబరులో 73,306 వాహనాలను రవాణాశాఖ రిజిస్టర్‌ చేసింది. 2022 డిసెంబరులో ఆ సంఖ్య 78,113కు పెరిగింది. ద్విచక్ర వాహనాలు తగ్గాయి. కార్లు పెరిగాయి. 2021 డిసెంబరులో 17,070 కార్లు రిజిస్టర్‌ కాగా, గత నెలలో ఏకంగా 22,279 అమ్ముడుపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details