Revanth Reddy Speech in Bus Yatra Parigi :కేసీఆర్ అధికార దాహార్తికి ప్రకటించిన దళితులకు మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్(Reservation) హామీలు ఏమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. పరిగికి గోదావరి జలాలు ఎందుకు రాలేదనికేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండో విడతగా నేడు ప్రారంభమైన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర.. ఇవాళ సాయంత్రం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చేరుకుంది. యాత్రలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు.
సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని రేవంత్ ఉద్ఘాటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ.. కాంగ్రెస్ హస్తగతమవటం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి శనిలా దాపురించందని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటానంటే వదులుతామా అని మండిపడ్డారు. దోచుకున్న సొమ్మునంతా కక్కించి తీరతామని వెల్లడించారు. మైకు దొరికిందని.. కేసీఆర్ తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఏం చేయాలో తెలియక చివరికి తనపై కేసీఆర్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను సామాజిక బహిష్కరణ చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కాంగ్రెస్ పరిగి నియోజక అభ్యర్థి.. రామ్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆరు గ్యారంటీలను(Six Guarantees) అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.