Malluravi Complained to CBI About Paper Leakage: సీఎం కేసీఆర్ పాలన గాలికొదిలి.. రాజకీయ విధ్వంసంలో మునిగిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనను పట్టించుకోకపోవడం వల్లే.. ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకేజీలు అవుతున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేతపట్టిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో.. ఎస్‌ఎస్‌సీ బోర్డు నుంచి టీఎస్‌పీఎస్సీ బోర్డు వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఇప్పుడు పరీక్షలను రద్దు చేయకూడదని.. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐకు కాంగ్రెస్ నేత మల్లు రవి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని కోఠి ప్రాంతంలో ఉన్న సీబీఐ కార్యాలయంలో వారిని కలిసి.. మల్లు రవి వినతిపత్రం అందించారు. వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లకు నోటిఫికేషన్లు ఇస్తే.. అవి వచ్చాయని సంతోషపడేలోపే.. లీకేజీలు జరుగుతున్నాయని బాధపడ్డారు. ఈ పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఏమి చేయాలో తెలియక అయోమయం స్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు.