Heavy Temperatures: రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. పగటి వేళల్లో భానుడి తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దీంతో పగటివేళల్లో రహాదారులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలు సేవిస్తూ, చెట్ల నీడన సేదతీరుతున్నారు.
నల్గొండలో అత్యధికం...
బుధవారం పగలు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. రాగల మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 5 రోజుల తరువాత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.