మెట్రో రైలు ఛార్జీల్లో రాయితీలు ప్రకటించే అవకాశం ఉందా? టిక్కెట్ల ధరల తగ్గింపు పథకాలకు తెరతీయబోతున్నారా? ‘మెట్రోని మరింత సమర్థంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని’ సీఎం కేసీఆర్ ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులకు సూచించిన నేపథ్యంలో చర్చ మొదలైంది. ఇదే సమయంలో స్టేషన్లలోనూ, మాల్స్‌లోనూ దుకాణాల అద్దెలు భారీగా ఉన్నాయమని తగ్గించాలన్న వినతులు వ్యాపారుల నుంచి విన్పిస్తున్నాయి. కొవిడ్ భయాలు తొలగకపోవడంతో ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కొవిడ్ తొలి దశ అనంతరం మెట్రోని పునఃప్రారంభించినప్పుడు ఇలాగే ఉన్నారు. అప్పట్లో నాలుగు ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు. మూడునెలల పాటు వర్తించేలా ప్రయాణికుల టిక్కెట్లలో, పాసుల్లో రాయితీలు ఇచ్చారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ పెరిగింది. వేసవిలో మరింత పెరుగుతుందని అనుకుంటున్న దశలో ఏప్రిల్‌లో కొవిడ్ రెండో ఉద్ధృతితో ప్రయాణికులు తగ్గిపోయారు. మేలో కర్ఫ్యూ అమలుతో ఉదయం 7 నుంచి 10 గంటల వరకే సర్వీసులు నడిచాయి. ప్రయాణికుల సంఖ్య అత్యల్పంగా 4 వేలకు పడిపోయింది. ప్రస్తుత అన్‌లాక్‌లో వేళల్ని పొడిగించినా లక్షలోపే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సంఖ్య పెంచాలంటే మరోసారి ఛార్జీల్లో రాయితీ ఇవ్వక తప్పని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ తగ్గింపు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మెట్రో వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. లీటరు పెట్రోలు/డీజీలు ధర ఏడాది కాలంలో రూ.20కి పైగా పెరిగింది. సొంత వాహనాల్లో ప్రయాణం భారమైంది. ఈ తరుణంలో ఏ మాత్రం తగ్గింపు ఇచ్చినా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మొగ్గుచూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎందుకు అవసరం?