laddu auction at my home bhooja apartments: గణనాథులను ప్రతిష్ఠించి నేటికి నవరాత్రులు పూర్తి కావడంతో నగరంలో పలుచోట్ల నేడు నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహా గణపతి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన లడ్డూ వేలం పాటలు ఆయా చోట్ల ఆసక్తిగా సాగాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న లడ్డూను పలుచోట్ల భక్తులు పోటీపడి మరీ దక్కించుకున్నారు. అయితే నగరంలోని మాదాపూర్ మై హోమ్ భూజా అపార్ట్మెంట్ గణేశ్ మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా బాలాపూర్ లడ్డూ గత రికార్డునే బద్దలు కొట్టింది.
laddu prise at my home bhooja apartments auction: మైహోమ్ భూజాలో నివసించే వ్యాపారవేత్త సత్తిబాబు మోటూరి ఎవరూ ఊహించని రీతిలో రూ.20.50 లక్షలకు ఈ లడ్డూని వేలంలో దక్కించుకున్నారు. గతేడాది ఈ గణేశుడి లడ్డూను వేలంలో సొంతం చేసుకున్న విజయ్‌భాస్కర్‌రెడ్డి ఈ దఫా లడ్డూని సత్తిబాబుకు అందజేశారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి రేపు జరగనున్న బాలాపూర్ లడ్డూ వేలంపాటపై పడింది. అయితే ఈ ధరను బాలాపూర్ లడ్డూ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి.
రెట్టింపు ఉత్సాహం.. రికార్డు ధర..: 2021 సంవత్సరంలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఆ సంవత్సరం బాలాపూర్ లడ్డూను రూ.18.90 లక్షలకు ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఆయన స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు. 1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట 2020లో కరోనా వ్యాప్తి వల్ల జరగలేదు. దాంతో 2021లో రెట్టింపు ఉత్సాహంతో వేలం పాటలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే లడ్డూ రూ.18.90 లక్షల రికార్డు ధర పలికింది. ఇక 2019లో జరిగిన వేలంపాటలో కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈసారి ఎవరికి దక్కుతుందో..: లడ్డూ వేలం పాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకున్న బాలాపూర్ గణేశుడు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలమూలల ఉన్న తెలుగు వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతో పాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. మరి ఈసారి బాలాపూర్ లడ్డూను ఎవరు దక్కించుకుంటారో.. ధర ఎంత పలుకుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.