rains in telangana for next 3days: మండుతున్న ఎండాకాలంలో ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు ఎంతగానో నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు నీరుగారిపోయి తీవ్ర పంట నష్టం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
50 కి.మీ వేగంతో గాలులు:ఈ రోజు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు విస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందనీ పేర్కొంది. ఈ రోజు ద్రోణి, గాలిలోని అనిశ్చితి, పశ్చిమ విధర్బలోని ఆవర్తనం నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తెలంగాణలోకి దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని తెలిపింది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదయ్యే అవకాశం ఉందనీ పేర్కొంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.