బంధాలు.. అనుబంధాలకతీతంగా ఏపీ పల్లె పోరు సాగుతోంది. స్వయంగా అక్కాచెల్లెలు హోరాహోరీగా తలపడుతుండగా.. నేనున్నానంటూ మరో బంధువు రంగంలోకి దిగడం విశేషం. వీరికి ప్రధాన పార్టీలు మద్దతు తెలుపుతుండడం ఆసక్తి రేపుతోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్‌కు ప్రకాశం జిల్లాలోని కుంకలమర్రు పంచాయతీ వేదికైంది.
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రుకు చెందిన ఈదర రాజకుమారి, ఈదర సౌందర్య అక్కాచెల్లెలు. ఇద్దరికీ గ్రామంలోని దగ్గరి బంధువులతో వివాహం జరిగింది. మొన్నటి వరకూ ఆ రెండు కుటుంబాలూ ఒకే పార్టీలో ఉన్నాయి. సర్పంచ్ పదవిని ఇద్దరూ ఆశించి చెరో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈదర రాజకుమారి తెదేపా, చెల్లెలు సౌందర్య వైకాపా మద్దతుతో సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరి బంధువు ఈదర చంద్రిక జనసేన తరఫున సవాల్ విసురుతున్నారు. పార్టీరహితమైనా తమ వారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీల శ్రేణులు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి.