Political leaders mourn Veteran Actor Krishna's death: సూపర్‌స్టార్ కృష్ణ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. కృష్ణ మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. 'కృష్ణగారు లెజెండరీ నటుడు. తన విలక్షణ నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం.. సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగానికి తీరని లోటు. మహేశ్‌బాబు, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని తెలిపారు.
తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. తెలుగు సినిమా స్థాయిని కృష్ణ పెంచారని కీర్తించారు. యువశక్తి చిహ్నంగా ఉండే పాత్రలను కృష్ణ ఎంచుకునే వారని గుర్తు చేసిన వెంకయ్య.. ఏడాదికి సగటున పది సినిమాల చొప్పున చేస్తూ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం: సూపర్‌స్టార్ కృష్ణ ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు వెండితెర కౌబాయ్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కుటుంబ చిత్రాలు, యువత, కార్మికుల్లో స్ఫూర్తిని నింపే పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
వృత్తి పట్ల క్రమశిక్షణ ఉండేది..: కృష్ణ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. తెలుగు సినిమా సూపర్‌స్టార్ కృష్ణ మరణవార్త చాలా బాధాకరమన్నారు. సినీ వృత్తి పట్ల కృష్ణకు క్రమశిక్షణ ఉండేదన్న రాహుల్.. ఆయన మరణం సినీలోకానికి తీరని లోటన్నారు. కృష్ణ కుటుంబసభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎం.కె.స్టాలిన్ సంతాపం..: కృష్ణ మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. తెలుగు సినీరంగంలో కృష్ణ.. ప్రయోగాత్మక, విలక్షణ పాత్రలు చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం సినీరంగానికి తీరని లోటన్న స్టాలిన్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
రాష్ట్ర మంత్రుల సంతాపం..: కృష్ణ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో కృష్ణ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగానికి సూపర్‌స్టార్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. కృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఒకే ఏడాదిలో ముగ్గురు ఆత్మీయులను కోల్పోయిన.. నెల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.