PERMISSION TO LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పాదయాత్రపై ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజుల నుంచి పాదయాత్రపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. దానికి తెరదించుతూ నేడు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు లోకేశ్ ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఈనెల 27న కుప్పంలో బహిరంగ సభకు అనుమతి ఇస్తున్నట్లు.. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అయితే లోకేశ్ పాదయాత్రలో షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదని.. రహదారులపై సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బాణసంచా పేల్చకూడదని.. పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు తీసుకెళ్లకూడదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఆదేశాలు పాటించాలని.. శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
అయితే షరతులతో కూడిన అనుమతులు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత అనుమతి పత్రాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల 27న కుప్పం పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.