Polavaram Project Authority Meeting: పోలవరం ప్రాజెక్టు అథారిటీ 15వ సమావేశం... బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణా, గోదావరి భవన్‌లో... పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఇంజనీర్లు హాజరయ్యారు. కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్న ఈ భేటీలో ఎజెండాలోని 15 అంశాలపై చర్చించారు. పోలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంభవించే ముంపుపై తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా కొన్ని వివరాలు సమర్పించింది.
బ్యాక్ వాటర్స్ కారణంగా 892 ఎకరాలు ముంపునకు గురవుతోందని... స్థానిక ప్రవాహాలు, డ్రైనేజ్ కారణంగా ముప్పు పొంచి ఉందని వివరించింది. 2022 జూలై వరదల సందర్భంగా వచ్చిన ముంపు, నష్టాన్ని... అథారిటీకి సమర్పించిన నివేదికలో తెలంగాణ సర్కార్ పొందుపరిచింది. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని పేర్కొంది. పోలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా తెలంగాణలో ముంపుపై ప్రస్తావించగా... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల అంశాలను కేంద్ర జలసంఘం పరిగణలోకి తీసుకుని.. అధ్యయనం చేయించడానికి అంగీకరించినట్టు తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. ఉమ్మడి సర్వేకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిపారు.