తెలంగాణ

telangana

ETV Bharat / state

గాలి నుంచి ఆక్సిజన్ తయారీ.. మూడు ప్లాంట్లు పంపిన కేంద్రం

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్​ సోకిన వారు ఆక్సిజన్​ అందక చనిపోతున్నారు. ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టిసారించింది. గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే మూడు ప్లాంట్లను తెలంగాణకు పంపింది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. వచ్చేవారం నుంచి ఇవి అందుబాట్లోకి రానున్నాయి.

oxygen
ఆక్సిజన్​

By

Published : Apr 24, 2021, 6:37 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టిసారించింది. గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే మూడు ప్లాంట్లను తెలంగాణకు పంపింది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. వచ్చేవారం నుంచి ఇవి అందుబాట్లోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల డిమాండును పరిగణనలోకి తీసుకున్న మీదట సాధ్యాసాధ్యాలను పరిశీలించి తెలంగాణకు మరో మూడు ప్లాంట్లు కేటాయించాలన్న యోచనలో ఉన్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతినిధి ఒకరు శుక్రవారం ‘ఈనాడు’కు చెప్పారు.
పెరిగిన ఆక్సిజన్‌ అవసరాలు
రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో ఉండటంతో అసుపత్రుల్లో చేరే వారిలో కనీసం 50 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది.రోజూ 280 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కావల్సివస్తోంది. బాధితుల సంఖ్య పెరిగితే రోజుకు కనీసం 380 మెట్రిక్‌ టన్నులు అవసరమని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కేంద్రం ఇతర రాష్ట్రాల నుంచి కొంత మేరకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసేందుకు వీలుగా హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ ఆస్పత్రులకు ప్రెజర్‌ స్వింగ్‌ అడ్‌సోర్‌ప్షన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను పంపింది. వీటి ద్వారా సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురి చేయటం ద్వారా నైట్రోజన్‌, కార్బన్‌-డై-ఆక్సైడ్‌, ఇతర వాయువులను వేరు చేసి ఆక్సిజన్‌ తీస్తారు. దాన్ని ఫిల్టర్‌ చేసి పైప్‌లైన్‌ ద్వారా ఆసుపత్రిలోని వైరస్‌ బాధితులకు అందిస్తారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను కేంద్ర ప్రభుత్వం తొలిదశలో జర్మనీ, ఇటలీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంది. తాజాగా దేశీయంగా కూడా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన యంత్రాల్లో కొన్నింటిని ఆక్సిజన్‌ కొరత ఉన్న రాష్ట్రాలకు తాజాగా అందచేసింది.
గాంధీలో రేపు ప్రారంభం
మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. ఖమ్మం, కరీంనగర్‌ ఆసుపత్రుల్లో ఇప్పటికే వీటిని లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంటును ఆదివారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో తొలుత ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను పరీక్షల కోసం దిల్లీకి పంపారు. అక్కడ ధ్రువీకరించిన మీదట వైరస్‌ బాధితులకు అందచేస్తారు. వారంలోపే ఆ నివేదిక వస్తుందని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఆ తర్వాత రోజూ ఒక్కో ఆసుపత్రి పరిధిలో కనీసం 250 పడకల్లోని బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేయవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేటాయించిన మూడు ప్లాంట్ల ద్వారా నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇటువంటి ప్లాంట్లు ఇప్పటికే అందుబాట్లోకి వచ్చాయన్నారు. ఆక్సిజన్‌ నాణ్యత 95 నుంచి 97 శాతం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details