రాష్ట్రంలో పంటనష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగే వరకూ అన్నదాతల పక్షాన పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వరిపంటకు ఎకరానికి రూ.20వేలు, పత్తి పంటకు రూ.30 వేలు లెక్కన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతో జూమ్ యాప్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆదుకోలేదు..
ఎడతెరపి లేని వర్షాలతో రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కసారి కూడా రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకున్న పాపాన పోలేదని ఉత్తమ్ ఆరోపించారు.