తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో పగలంతా వాహనాల రద్దీతో హడావుడిగా కనిపిస్తున్న నగరం.. రాత్రుళ్లు మరో ప్రపంచంగా మారిపోతోంది. స్నేహితులతో కలిసి అలా నెక్లెస్ రోడ్డు(Necklace Road)లో షికారు చేస్తూ... చిరుగాలుల్లో ఎన్నో ఊసులు చెప్పుకొంటూ వేడివేడి ఛాయ్‌ను ఆస్వాదించేందుకు జనాలు ఉవ్విళ్లూరుతున్నారు. రాత్రి అయితే.. పబ్బుల్లో హుషారుగా చిందేసే ఇక్కడి కుర్రకారు సంగతి చెప్పనక్కర్లేదు. రాత్రి అయితే చాలు కొత్త లోకంలో విహరించేందుకు.. స్నేహితులతో సరదాగా గడిపేందుకు.. నగరంలోని తమకు అనుకూలమైన ప్రాంతాల కోసం అన్వేషిస్తారు. వీరి కోసం నగరంలో అర్ధరాత్రి వేళ్లల్లో కొన్ని రెస్టారెంట్లు, బడ్డీ కొట్లు తెరిచే ఉండటంతో అక్కడ వాలిపోతున్నారు. దీంతో సుమారు 40 రోజుల విరామం తర్వాత మునుపటిలా రద్దీ కనిపించిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగరంలో మళ్లీ పాత జోష్... రాత్రివేళ షికార్లు
నైట్‌లైఫ్‌కు మారుపేరైన భాగ్యనగరంలో మళ్లీ పాత జోష్ కనిపిస్తోంది. ఇన్నాళ్లు కరోనా, లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైనవారంతా ఇప్పుడు రాత్రివేళ నగర అందాలను చూస్తూ.. నచ్చిన స్ట్రీట్‌ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. దీంతో వీధి వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.
అమీర్‌పేట్(Ameerpet)లో రాత్రివేళ దొరికే బటర్‌దోశెలు, కారందోసె లాంటి టిఫిన్లు వేడివేడిగా లాగించేందుకు స్థానిక యువకులతో పాటు దూర ప్రాంతాల నుంచి జనాలు వస్తుంటారు. మాదాపూర్, హైటెక్‌సిటీ గురించి చెప్పనక్కర్లేదు. బంజారాహిల్స్ బసవతారకం ఆసుపత్రి వద్దకు వచ్చే రోగుల అటెండెంట్‌లు సైతం రాత్రి వేళలో వీధి ఆహారం(Street Food) తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇక్కడ లభించే జొన్న రొట్టెలు, ఫాస్ట్‌ఫుడ్, బేకరీ ఆహారం కోసం గుమిగూడుతున్నారు.
ఇదీ చూడండి:హెచ్1బీ వీసాదారులకు శుభవార్త!