NVSS Prabhakar Fires On TS Government: రాష్ట్రంలో మూడు నెలలుగా పాలన స్తంభించిందని భాజపా సీనియర్ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఫాంహౌజ్ ఫైల్స్ బయటకు రావడంతో కేసీఆర్‌కు నిద్రపట్టడంలేదని విమర్శించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయమయం చేశారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్న విషయాన్ని.. ప్రైవేటుగా కలిసినప్పుడు చెబుతున్నారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.
అందరూ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని.. చివరకు గవర్నర్ కూడా తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చెప్పారు. ఈ వ్యవహారమంతా సీఎంవో కనుసన్నల్లో నుంచే జరుగుతుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తెరాస సర్కారు ఆధోగతి పాలు చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరణి తెచ్చి భూములు తారుమారు చేశారని ప్రభాకర్ విమర్శించారు.
తద్వారా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. అంతే కాకుండా ధరణి పేరు చెప్పి భూములను తెరాస నాయకులు మాయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ విశ్వవిద్యాలయాల్లో ఛాన్స్‌లర్ వ్యవస్థను ఎలా బలహీనపర్చారో చూశామని చెప్పారు. చట్టసభలకు విలువ లేకుండా ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. అలాంటప్పుడు కేసీఆర్ రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తారా అని అన్నారు. నయీం, డ్రగ్స్, ఈఎస్ఐ స్కామ్, డేటా చౌర్యం కేసులో వేసిన సిట్‌లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. బ్లాక్ మెయిలింగ్ కోసమే ఈ విచారణలని ఆరోపించారు. ప్రధానిని అడ్డుకోవడమంటే అభివృద్దిని అడ్డుకోవడమేనని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు.