తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె పోరు: ఏపీలో ముగిసిన రెండో దశ నామినేషన్ల ఘట్టం - పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు

ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దఫా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు కావటంతో అభ్యర్థులు పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల దృష్ట్యా కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

పల్లె పోరు: ఏపీలో ముగిసిన రెండో దశ నామినేషన్ల ఘట్టం
పల్లె పోరు: ఏపీలో ముగిసిన రెండో దశ నామినేషన్ల ఘట్టం

By

Published : Feb 5, 2021, 8:17 AM IST

ఏపీలో రెండో దఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్‌ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ల దృష్ట్యా కొన్నిచోట్ల ఘర్షణలు జరిగాయి. రెండో దఫాలో 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో మూడోరోజు 417 మంది నామపత్రాలు దాఖలు చేశారు. నరసరావుపేట డివిజన్‌లో మొత్తం 657 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చివరిరోజు నామినేషన్ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లో అభ్యర్థులు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. ఉండ్రాజవరంలో భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు. ప్రకాశం జిల్లా నీలాయపాలెం, యర్రంవారిపాలెం సర్పంచ్‌ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్ల దాఖలుకావడంతో ఏకగ్రీవమయ్యాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో చివరిరోజు నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అరవపల్లిలో నామినేషన్ల వేళ... తెలుగుదేశం, వైకాపా వర్గాలు బాహాబాహీకి దిగాయి. కాకుమాను మండలం గరికపాడులో తెదేపా మద్దుతుదారులను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో తెదేపా బలపరిచిన సర్పంచ్​ అభ్యర్థి ఓబుల్ రెడ్డి అదృశ్యం కలకలం రేపింది. గురువారం రాత్రి ఆయన్ని ఇంటి వద్ద వదిలేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో బీసీలకు ఒక్క వార్డు కేటాయించలేదంటూ ఆందోళన చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధిపురంలో భాజపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సుశీల చేతుల్లోని నామ పత్రాలను వైకాపా నేత లాక్కుని చించేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

రెండోదశ నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో.... సర్పంచ్, వార్డు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిమ్మాడలో ప్రచారం వేళ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు సూచించారు. ఎన్నికల్లో అభ్యర్ధులు ఖర్చు చేస్తున్న వ్యయంపై వ్యయ పరిశీలకులు నిఘా పెట్టాలని కలెక్టర్ ఇంతియాజ్‌ నిర్దేశించారు. అనంతపురం జిల్లాలో 5 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించటంలేదని కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు.

ఇదీ చదవండి:మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!

ABOUT THE AUTHOR

...view details