దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు ఎన్నో జలపాతాలు, సెలయేళ్లకు ఆలవాలం ఏపీ చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు. భారీ వర్షాలకు జలపాతాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఆ విధంగా ఎత్తైన కొండల నుంచి జాలువారే నీరే అక్కడి రైతులకు ఆధారం. పర్యాటక ప్రాంతం తలకోనలోని జలపాతం నీటిపై మూడు మండలాలకు చెందిన రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యర్రావారి పాళెం,చిన్నగొట్టిగల్లు, రొంపిచర్ల మండలాల్లోని రైతులు ఈ శేషాచలం కొండల్లో నుంచి ప్రవహించే నీటితోనే సాగు చేస్తుంటారు.
ఈ మూడు మండలాల్లో దాదాపు 5వేల 200 హెక్టార్ల సాగు భూమి ఉన్నా.. కేవలం 2,035 హెక్టార్లలో మాత్రమే పంట వేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన నీరు పుష్కలంగా ఉన్నా.. అధికారుల ప్రణాళిక లోపం రైతుల పాలిట శాపంగా మారింది. కళ్లముందే గంగమ్మ ప్రవహిస్తున్నా.. సాగునీటి కోసం వందల అడుగుల లోతు వరకు బోర్లు తవ్వుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.